Friday, April 17, 2009

26.2 మైళ్ళ పరుగు ప్రయత్నంలో నేర్చుకున్నవి

ఈ మారథాన్ పరుగు ప్రయత్నంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవి. నిజానికి తరతరాలనుంచి పెద్దవాళ్ళు చెప్పినవే. కొన్ని నా ప్రయాణంలో గోచరించినవి, మరి కొన్ని మునుపు విన్నవీ తిరిగి గుర్తుకొచ్చినవీను. ఇలా మీ అందరితో మరోసారి పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను.

  1. ఏ పనైనా మొదలుపెట్టకముందు అసాధ్యంగానే ఉంటుంది. అలాగే నాకు 26మైళ్ళు అనగానే గుండెల్లో రాయి పడింది. ఏకధాటిన నాలుగు గంటల పరుగు అనేసరికి నా సామర్ధ్యం మీద నాకే అపనమ్మకం, అసలు సాధనలోకి వెళ్ళాలా వద్దా అని సంకోచం కలిగాయి. సంకల్పసిద్దే నా బలం అనుకుని మొదలిడాను. అంతిమ లక్ష్యం గురించి ఆలోచించకుండా, నెలల తరబడి కొంచం కొంచంగా పరుగు దూరం పెంచుకుంటూ పోయి ఆఖరుకు పరిగెత్తేసా. దేనికైనా ప్రారంభం కావాలి. అది అనుకున్న రోజే కావాలి. కాలక్రమేణా మన లక్ష్యానికి చేరువ అవుతాం.
  2. ఆసరా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. నాకు ఒక మంచి మనిషి ప్రోత్సాహం దొరికేసరికి, లక్ష్యం ఎంత కష్టం అని ఆలోచించకుండానే ముందుకి దూకాను. మనలను ప్రొత్సాహించే మంచి వాళ్ళు దొరకటం మన అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మన జీవన ప్రయాణంలో వెతుకుతూ ఉండాలి. మనకి అందిన ప్రోత్సాహం మనం కూడా ఇతరులకు ఇవ్వాలని నేర్చుకున్నాను.
  3. లక్ష్యం నిర్దేశితమైన తరువాత, ఎండ, వాన, చలి అనేది లేకుండా ప్రయత్నిస్తాం (నాది పరుగు కాబట్టి వాతావరణం పాత్ర ఉంది). చలి అంటే ఇంట్లో మునగ తీసుకుని, వెచ్చగా రగ్గు కప్పుకుని బిర్యాని (కొంత మందికి మిరపకాయ బజ్జీలు) తినే బాపతు అయిన నేనే, ఎముకలు కొరికే చలిలో పరిగెడతానని కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు అలా పరిగెత్తే వాళ్ళను చూసి, అసలు ఎలా పరుగెడతారో అనుకునే వాడిని. కానీ నా లక్ష్యమే నన్ను చివరి వరకు నడిపించింది.
  4. లక్ష్య సాధన వయసుకి సంబందించిన కాదు, మనసుకి ముడిపడినది. దానికి స్త్రీ పురుషుల తేడా తెలియదు. నేను ఈతకొలను లో ఈత నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నా ప్రక్కనే ఒక 90 ఏళ్ళ స్త్రీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవటానికి వచ్చింది. ఆమెతో పరిచయమైతే చెప్పింది, 80 ఏళ్ల స్నేహితురాలు నేర్చుకుందంట ఈ మధ్య , అందుకని ఈమె మొదలుపెట్టింది. ఆ రోజే అనుకున్నా, జీవితాంతం వరకు క్రొత్తవి నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ గడపాలని.
  5. లక్ష్య సాధనలో, హేమాహేమీలు ఎదురౌతారు, మనం చెయ్యాలనుకున్నది అవలీలగా చేస్తుంటారు. మన గోల మనది. సాధన చేస్తున్నప్పుడు, నా స్నేహితుడు చెప్పిన విషయం, "మారథాన్ పరుగెడుతున్నప్పుడు, 70 ఏళ్ళ వ్యక్తి కూడా కుర్రవాడి మాదిరిగా సునాయాసంగా నిన్ను దాటి వెళ్ళిపోతుంటాడు. అది చూసి ఏమీ కలత చెందవద్దు. నీ ప్రయత్నం నీది. వాళ్లెంత సాధనతో ఈ స్థానానికి చేరుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదు. నువ్వేదో పోటుగాడిలా ఈ మధ్య మొదలుపెట్టి, రెచ్చిపోయి చతికిలపడకు." అని. అటువంటివారు నిజంగానే తారసపడ్డారు. వారు నాలో ఆ స్థాయికి చేరాలన్న స్ఫూర్తిని పెంచారే కానీ వారిని అధిగమించగలనా అని నిస్పృహని మాత్రం కలిగించలేదు.
  6. మనిషి తలచుకుంటే ఏమన్నా చేయగలడు. నా మటుకు నేను పూర్తిగా తలచుకోలేదు. అయినా చేసిన సాధన సరిపోయి, దేవుని దయ వల్ల పూర్తి చేసేసాను. కాబట్టి మనము పూర్తి ప్రయత్నం చెయ్యకుండా, దేవుని పై భారం వదిలెయ్యాలి. (అయ్యో ఇది ఆచరించారంటే గొడవలైపోతాయి)

ఇవన్నీ నేనేమీ కొత్తగా కనిపెట్టిన విషయాలేమి కాదు, నేను నేర్చుకున్న విషయాలు. ఇంకొన్ని విశేషాలతో తరువాయి టపాలో కలుద్దాం.

Wednesday, April 15, 2009

మారథాన్ పరిగెట్టేసా

అన్నమాట ప్రకారం వివరాలు ఇవ్వటానికి వచ్చేసాను.  మారథాన్ పూర్తి అవటం,  నేను సఫలీకృతుడనవటం పూర్తయింది.  చివరాఖరికి ఎట్లాగైతే 26.2 మైళ్ళు 5గంటల 25నిమిషాలలో పరిగెట్టేసి నా లక్ష్యం సాధించేసా.  మా ప్రొఫెసరు గారి సహకారానికి ఓ అర్థం కల్పించాను.  భారతీయులు మారథాన్లు చేయగలరని నిరూపించాను.  

కృషిచేయాలని వున్నా ఇతరత్ర కారణాల వలన సాధనే అంతంత మాత్రం అంటే, మారథాన్ ఇంకో 5 రోజులు ఉందనగా జ్వరం వచ్చి మంచాన బడ్డాను. డాక్టర్ ఇచ్చిన సలహా ఏమిటంటే "జీవితంలో ఇంక ఎప్పుడైనా పరిగెట్టెచ్చు, ఇంకా తగ్గని జ్వరంతో 26 మైళ్ళ పరుగంటే కొంచం రిస్క్, ఇక నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో" అని. నా కేమీ తోచలేదు. 

శనివారం మారథాన్ అనగా, గురువారం ఉదయానికి జ్వరం తగ్గుముఖం పట్టింది. పొట్టపగల తినటం మొదలుపెట్టా. ఏదో విధంగా జ్వరంతో వచ్చిన నీరసాన్ని పోగొట్టాలని.

శనివారం మారథాన్ రోజు:

జీవితమంతా కుంభాలు కుంభాలు తింటూనే ఉన్నాను కదా, శక్తి ఉంటుందనే ఆశతో పరిగెట్టటానికి నిర్ణయించుకున్నా.  మా జమైకన్ ప్రొఫెసర్ గారు ప్రక్కనే ఉండి, ఒక వేళ మధ్యలో బాగా లేకపోతే ఆగి పోదువుగానీ అని సలహా ఇచ్చారు

8 గంటలకు పరుగు మొదలు, సుమారు 10 వేలమంది పాల్గొన్నారు పేస్ టీంలని ఉంటాయి, మన పరుగు సత్తా బట్టి వాళ్ళతో పరిగెడితే, ఒకటే స్థిరమైన వేగంలో పరిగెడతారు కనుక మనకొక నిర్దేశం వుంటుంది. మేము 4:30 పేస్ టీం తో బయలుదేరాము, అంటే మారథాన్ 4:30 గంటలలో పూర్తి చేసేటట్లు.

మొదటి 16 మైళ్ళు ఏ విధమైన సమస్య లేకుండా పరిగెత్తా,  మైలు 10నిమిషాల చొప్పున పూర్తిచేసేసాను. ఇక అప్పుడు ఆరంభమయ్యాయి,  క్రాంప్స్, పిక్కలు పట్టివేయటం అకస్మాత్తుగా ముందు కొంచం కొంచంగా మొదలై 18 వ మైలు దగ్గర ఎక్కువయ్యి చివరికి కాలు తీసి కాలు వేయలేనంత నెప్పి. ఒక రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళా పరిగెడదామంటే నెప్పి మొదలు. మా ప్రొఫెసర్ గారు "ఇంక నడుద్దాము.  ఎలాగోలా మారథాన్ పూర్తి చేద్దాం , నీకు మొదటిది కదా" అని అన్నారు.

నాలుగు మైళ్ళు నడిచిన తరువాత నెప్పి తగ్గినట్లనిపిస్తే నిదానంగా పరిగెట్టి చివరి మైళ్ళు పూర్తి చేసా.  అలా మొత్తానికి పూర్తి చెయ్యగలిగా.

విపరీతమైన చలికాలంలో సాధన చేసి, మధ్యలో రెండు మూడు వారాలు మడం నెప్పి తెచ్చుకుని (పాత షూ తో పరిగెట్టినందుకు), నివారణలు కనుక్కుని నెప్పి తగ్గించుకుని, మళ్ళీ పరుగులు సాధన చేసి, ఈ నా యజ్ఞాన్ని పూర్తి చేసా.  నిజానికి అలా ఎవో చిన్న చిన్న శారీరక ఇబ్బందులు,  వాటిని తట్టుకోవటం అంతా మానసికంగా మనలోని నిగ్రహాన్ని, సహనాన్ని వెలికి తెస్తాయి అని అనిపించింది. 

మైలు 20న, ఎవరైతే మా ప్రొఫెసర్ గారితో భారతీయులు మారథాన్ పరిగెట్టలేరు అన్నారో, ఆయనే దారి ప్రక్కన చేయి ఊపుతుంటే, నన్ను చూపించారు ఆయనకి.

మారథాన్ ఈజ్ ఎ మైండ్ గేం! 

http://www.illinoismarathon.com/

Friday, January 30, 2009

ఇండియన్స్ మారథాన్ పరిగెట్టలేరన్న మాటకి ఒక జమైకన్ కి కోపం వచ్చిన వైనంబెట్టిదనిన

నా స్నేహితుడు ఒక ఆయన మా ఊరి యూనివర్సిటీ లొ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం జమైకా, ఆయనకి పరిగెట్టడం చాలా ఇష్టం, అది అంతా ఇంతా కాదు, ఆయనలా  గంటలు గంటలు ఆనందంగా పరిగెట్టే వాళ్ళని నేను ఇంత వరకు చూడలేదు ఎప్పుడూ.

ఈ జమైకా వాళ్ళంతా ఇంతే అనుకుంటా,  మొన్న ఒలింపిక్స్ లో చాలా వేగంగా పరిగెట్టిన ఉస్సైన్ బోల్ట్ కూడ అక్కడనుంచే. బోల్ట్ మరీ దారుణం ఏమిటంటె,  100 మీటర్లు డాష్ లో ఫినిషింగ్ లైన్  కంటే ముందే సెలబ్రేషన్ మొదలు పెట్టేసాడు.  100 మీటర్ల పోటీ లో గెలుపు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఈయన గారు ఇంకో 5 మీటర్లు ఉందన గానే పండగ చేసుకోవటం,  చరిత్ర లో మళ్ళా జరగక పోవచ్చు.

సరే మళ్ళా మా స్నేహితుడి సంగతికి వద్దాం.  ఆయన ఇప్పటి వరకూ  ఓ వంద మారథాన్ల  లో పరిగెట్టారు. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడులా,  నేను పరుగెడుతున్న మారథాన్ 26.2 మైళ్ళు ఉంటే,  దీని కంటే దూరంవి 50మైళ్ళు పరుగు, 100మైళ్ళు పరుగులు కూడ ఉన్నాయి. 100 మైళ్ళ పరుగు ఉపయోగం ఎమిటంటే వైజాగ్  నించి రాజమండ్రి వెళ్ళటానికి బస్ ఎక్కక్కర్లేదు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.

మా ప్రొఫెసర్ గారు 50మైళ్ళ పరుగు పరిగెట్టారు , ఆయనకు 100 మైళ్ళ పరుగు ఒక గోల్.

ఇంత పరుగరి దగ్గర కొంత మంది  పిహెచ్.డి  విద్యార్థులు ఉన్నారు. వారిలో  ఒక భారతీయుడు కూడా ఉన్నాడు.

మొన్న జరిగిన చైనా  ఒలింపిక్స్  లో ఇండియా ప్రదర్శన  గురించి  ఇద్దరి మథ్యా జరిగిన సంభాషణలో , ఆ యువకుడు తేల్చి  చెప్పాడంట, భారతీయులు పరిగెట్ట లేరని, మారథాన్లు  అస్సలు పరిగెట్టలేరని. (అది ఆ అబ్బాయి అభిప్రాయం, మన గురించి మనకే చిన్న చూపు అనే టాపిక్ తరువాత చూద్దాం, ఇప్పటికి వదిలెయ్యండి అతనిని).

ఆ మాట విని మా ప్రొఫెసర్ గారికి  తిక్క లేచింది. 

ఆయన కంకణం కట్టుకున్నాడు, ఎలా అన్నా నాతో మారథాన్ పరిగెట్టించి , ఇండియన్స్ కూడా పరిగెట్టగలరని నిరూపిద్దామని.

నేను మారథాన్ పరిగెట్టటం అంటే ప్రపంచ వింతలలోకి ఎక్కించెయ్యొచ్చు.
----------------------------------------     వివరాలు తరువాతి పోస్ట్ లో.

Tuesday, January 27, 2009

నా మారథాన్ - పరుగు ప్రయత్నం - కధా కమామీషు

గత రెండు నెలలుగా మారథాన్ పరిగెడదామనే ప్రయత్నంలో ఉన్నాను

పరిగెట్టే రోజు : 04/11/09
దూరం : 26.2 మైళ్ళు

ఎలాగు పరిగెడుతున్నా కదా, ఆ అనుభూతులు, ఆ జ్ఞాపకాలు, ఆ కష్ట నష్టాలు మీతో పంచుకుంటాను

మొన్న ఆదివారం 13.5 మైళ్ళు రెండున్నర గంటలలో పరిగెట్టాను
( దూరం బట్టి నాగార్జునసాగర్ నుంచి మాచెర్ల వరకు అనుకోండి )

ఇదంతా ఎలా మొదలైంది నుంచి మొదల బెట్టి,చివరాఖరులో పరుగు ముగించేంత వరకు వ్రాయటానికి ప్రయత్నిస్తాను

ఈ ప్రయాణంలొ ఇప్పటికే చాలా జీవిత పాఠాలు నేర్చుకున్నాను

నన్ను ఆశీర్వదించండి,
ఇట్లు భవదీయ పరుగరి

Thursday, January 15, 2009

మన సమస్యల్లో మన పాత్ర ఎంత?

ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి కుటుంబ సమస్యలతో.
కలసివుంటే కలదు సుఖం అనేది అందరికి తెలిసినదే.
చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండంతలు చేసి, తమకి తామే తెలియకుండా హాని చేసుకుంటున్నారు.
క్షమించే గుణం లేకపొవడం, తాము తప్పు చెయ్యమని, తనవాళ్ళూ తప్పు చెయ్యరనే
మొండి నమ్మకం చాలా సమస్యలకు హేతువౌతుంది.
ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఎంతో మంది, కుటుంబ సమస్యల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
నిరాశ నిస్పృహలతో గమ్యం చేరుకోలేకపోతున్నవారు కోకొల్లలు.
ఇంట్లో రోజూ కొట్టుకు చస్తుంటే ఇంక ఏ మనిషైనా బయట సాధించేదేముంది?
చాలా వరకు ఇతరుల మీద ద్వేషం తమకే ఎక్కువ హాని చేస్తుందన్న విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారంతా.
స్వతహాగా సాధులక్షణాలు కలవారు కూడా సహవాస దోషంతోనో,
పరిస్థితుల ప్రభావానికో ఈ కుటుంబ కలహాలలో పెద్ద పాత్రనే వహిస్తున్నారు.
సామరస్యంగా ఉంటే కలిసి బాగుపడతామనే ధ్యాసే లేదు.
ఒక చోట ఒక అత్త కారకురాలైతే, ఇంకొక చోట కోడలు కారకురాలు.
ఒక చోట ఒక అన్న కారకుడైతే, ఇంకొక చోట ఒక తమ్ముడు కారకుడు.
ఇలా ఎంతో మంది కారకులు ఎంతో మంది బాధితులు.
రోజు రోజుకీ ఈ చాప కింద నీరు లాంటి సమస్యలు ఎక్కువౌతున్నాయి.
చదువులు వ్యక్తిత్వాన్ని పెంచట్లేదు.
రాజీ పడే వారు తమ మనస్తత్వాన్ని చంపుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
చిన్న చిన్న తప్పులను బట్టే మనుషలను చెడ్డగ జమ కట్టి,
వేరొక అవకాశం ఇవ్వని స్వభావం ఎన్నో సమస్యలకు హేతువు.
మన సమస్యల్లో మన పాత్ర ఎంతో, ఒక్క సారి ఆలోచించండి !

Tuesday, December 23, 2008

సిగ్గుచేటు - ఆంధ్రలో అక్షరాస్యత ఎంతో తెలుసా

సుమారు ఏడు సంవత్సరాల కింద, స్నేహితులమంతా కలిసి పేద విద్యార్దులకు సహాయం చేసే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్న సమయంలో తెలిసిన దిగ్బ్రాంతికరమైన విషయమిది.
అక్షరాస్యతలో భారతదేశంలో ఆంధ్ర స్థానం. ఎంతో ఊహించండి.
విద్యుద్ఘాతం తగులుతుంది తెలుసుకుంటే. రక్తపు పోటు వంటివి ఉన్న వారు తెలుసుకోకపోవటం చాలా ఉత్తమం.

ప్రపంచదేశాలలో ఇండియా స్థానం 159, 65.2% తో. తరువాత ఉన్న కొన్ని దేశాల పేర్లు రువాండా,ఇతియోపియా -- మరీ ఎక్కువ లేవులెండి http://en.wikipedia.org/wiki/List_of_countries_by_literacy_rate

భారతదేశ పరిస్థితి చూశారు కదా. ఇంక ఆంధ్రదేశానికి వద్దాం. చెప్పేస్తున్నా, ఇంతకు ముందే తెలిస్తే గమ్మునుండండి. ఇది తెలియనివాళ్ళను ఆశ్చర్యపరచడానికే.

చెప్పేస్తున్నా
60.47% అక్షరాస్యతా శాతంతో 28వ స్థానంలో ఉంది.

ప్రక్కనే తోడుగా రాజస్తాన్
కొంచం కిందగా
జమ్ము కాశ్మీర్
అరుణాచల్ ప్రదేశ్
జార్ఖండ్
ఉత్తరప్రదేశ్
బీహార్
దాద్రనగర్ హవేలి అనే బుల్లి కేంద్రపాలిత ప్రాంతం

నమ్మట్లేదు కదా, మీరే కాదు నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు ఇప్పటివరకు. అందుకే గవర్నమెంటోల్లదే లింకోటిస్తా చూసుకోండే http://indiabudget.nic.in/es2007-08/chapt2008/tab94.pdf

ఒక పనికిరాని విషయం - ఆంధ్రరాష్ట్రమే ఒక దేశమనుకోండి,
... ..... .....అప్పుడు దాని స్థానం ప్రపంచంలో 166
--ఎరిట్రియా, బురుండి మధ్యలో (ఎప్పుడన్నా విన్నారా ఈ దేశాల పేర్లు)


Monday, December 22, 2008

ప్రకృతానందక అవరోధకాలు, వాటి పరిణామాలు

క్రొత్త పరిణామం కొంగ్రొత్త రూపాంతరం

ఎప్పుడూ పరికించని చిన్న చిన్న గుర్తులే అవలోకిస్తే అద్భుతాలే

ఎండిపోయిన చెట్టు కూడా అందంగా కనిపిస్తుంది

ఇన్ని రోజులూ ఎందుకు చూడలేదని చెట్టు చేమలు నిష్టూరాలాడుతున్నాయి

హడావిడి జీవితం అనే సాకు చెప్పి ఏమార్చుదామని ప్రయత్నించా

మరి ఇప్పుడు ఎలా గోచరిస్తున్నామనంటే ఏమని చెప్పను

పొరలు కమ్మి చెదలు పట్టిన మనసు ఒక్క సారిగా

కమ్మిన పొరలను చేదించుకుని అంతరిక్షంలోకెళ్ళి భూమిని చూస్తున్న అనుభూతి

మనసులోని ఆలోచనలను పరిమితం, సంకుచితం చేసిన అవరోధకాలు మటుమాయం

లోకం కొత్తగా కనిపిస్తుంది, మనుషులు కొత్తగా కనిపిస్తున్నారు

కూలంకషగా పరిశీలిస్తున్నా కంటికే కనబడేవాటినన్నిటినీ

ఉన్న స్థానం నించి సూటిగా ఆకాశంలొకి ఒక గీతని గీస్తే

అనంతాకాసంలొ ఎక్కడో అన్ని గీతలు కలిసే చోటునుంచి

చూస్తున్నా ఈ విశ్వాన్ని , జీవితాన్ని ,జీవితపు మలుపులను ,గమ్యాన్ని

రమణ మహర్షో, జిడ్డు కృష్ణమూర్తిగారో కలలోకి వచ్చి జీవిత పరమార్ధం బోదించినట్లు

జీవితం చాలా అందమైనది, జీవిత కాలం చాలా తక్కువ

చుట్టూ ఉన్న సుందర ప్రపంచాన్ని వదలి, కక్షలు కార్పణ్యాలతో, మనస్పర్ధలతో

జీవితాన్ని వృధా చేసుకోవద్దని అవగతమైంది

.........................................................ప్చ్ ఇంక కేస్ కొట్టెయ్యచ్చంటారా