Tuesday, December 23, 2008

సిగ్గుచేటు - ఆంధ్రలో అక్షరాస్యత ఎంతో తెలుసా

సుమారు ఏడు సంవత్సరాల కింద, స్నేహితులమంతా కలిసి పేద విద్యార్దులకు సహాయం చేసే ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్న సమయంలో తెలిసిన దిగ్బ్రాంతికరమైన విషయమిది.
అక్షరాస్యతలో భారతదేశంలో ఆంధ్ర స్థానం. ఎంతో ఊహించండి.
విద్యుద్ఘాతం తగులుతుంది తెలుసుకుంటే. రక్తపు పోటు వంటివి ఉన్న వారు తెలుసుకోకపోవటం చాలా ఉత్తమం.

ప్రపంచదేశాలలో ఇండియా స్థానం 159, 65.2% తో. తరువాత ఉన్న కొన్ని దేశాల పేర్లు రువాండా,ఇతియోపియా -- మరీ ఎక్కువ లేవులెండి http://en.wikipedia.org/wiki/List_of_countries_by_literacy_rate

భారతదేశ పరిస్థితి చూశారు కదా. ఇంక ఆంధ్రదేశానికి వద్దాం. చెప్పేస్తున్నా, ఇంతకు ముందే తెలిస్తే గమ్మునుండండి. ఇది తెలియనివాళ్ళను ఆశ్చర్యపరచడానికే.

చెప్పేస్తున్నా
60.47% అక్షరాస్యతా శాతంతో 28వ స్థానంలో ఉంది.

ప్రక్కనే తోడుగా రాజస్తాన్
కొంచం కిందగా
జమ్ము కాశ్మీర్
అరుణాచల్ ప్రదేశ్
జార్ఖండ్
ఉత్తరప్రదేశ్
బీహార్
దాద్రనగర్ హవేలి అనే బుల్లి కేంద్రపాలిత ప్రాంతం

నమ్మట్లేదు కదా, మీరే కాదు నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు ఇప్పటివరకు. అందుకే గవర్నమెంటోల్లదే లింకోటిస్తా చూసుకోండే http://indiabudget.nic.in/es2007-08/chapt2008/tab94.pdf

ఒక పనికిరాని విషయం - ఆంధ్రరాష్ట్రమే ఒక దేశమనుకోండి,
... ..... .....అప్పుడు దాని స్థానం ప్రపంచంలో 166
--ఎరిట్రియా, బురుండి మధ్యలో (ఎప్పుడన్నా విన్నారా ఈ దేశాల పేర్లు)


Monday, December 22, 2008

ప్రకృతానందక అవరోధకాలు, వాటి పరిణామాలు

క్రొత్త పరిణామం కొంగ్రొత్త రూపాంతరం

ఎప్పుడూ పరికించని చిన్న చిన్న గుర్తులే అవలోకిస్తే అద్భుతాలే

ఎండిపోయిన చెట్టు కూడా అందంగా కనిపిస్తుంది

ఇన్ని రోజులూ ఎందుకు చూడలేదని చెట్టు చేమలు నిష్టూరాలాడుతున్నాయి

హడావిడి జీవితం అనే సాకు చెప్పి ఏమార్చుదామని ప్రయత్నించా

మరి ఇప్పుడు ఎలా గోచరిస్తున్నామనంటే ఏమని చెప్పను

పొరలు కమ్మి చెదలు పట్టిన మనసు ఒక్క సారిగా

కమ్మిన పొరలను చేదించుకుని అంతరిక్షంలోకెళ్ళి భూమిని చూస్తున్న అనుభూతి

మనసులోని ఆలోచనలను పరిమితం, సంకుచితం చేసిన అవరోధకాలు మటుమాయం

లోకం కొత్తగా కనిపిస్తుంది, మనుషులు కొత్తగా కనిపిస్తున్నారు

కూలంకషగా పరిశీలిస్తున్నా కంటికే కనబడేవాటినన్నిటినీ

ఉన్న స్థానం నించి సూటిగా ఆకాశంలొకి ఒక గీతని గీస్తే

అనంతాకాసంలొ ఎక్కడో అన్ని గీతలు కలిసే చోటునుంచి

చూస్తున్నా ఈ విశ్వాన్ని , జీవితాన్ని ,జీవితపు మలుపులను ,గమ్యాన్ని

రమణ మహర్షో, జిడ్డు కృష్ణమూర్తిగారో కలలోకి వచ్చి జీవిత పరమార్ధం బోదించినట్లు

జీవితం చాలా అందమైనది, జీవిత కాలం చాలా తక్కువ

చుట్టూ ఉన్న సుందర ప్రపంచాన్ని వదలి, కక్షలు కార్పణ్యాలతో, మనస్పర్ధలతో

జీవితాన్ని వృధా చేసుకోవద్దని అవగతమైంది

.........................................................ప్చ్ ఇంక కేస్ కొట్టెయ్యచ్చంటారా

Wednesday, December 17, 2008

పులిని చూసి నక్క వాత - నానుడి1

ఏ మాటకామాటే, కవితాదృక్పదంతో వ్రాయటం చాలా కష్టమండి బాబూ, వెంటనే మీరు అడగవచ్చు అంత కష్టపడి వ్రాయాల్సిన అవసరమేంటి అని. మామూలుగా బ్లాగుల్లో అన్ని చోట్ల మంచి మంచి కవితలు చదువుతుంటాము కదా వీడేంటి అందంగా వ్రాయకుండా, వాడు పడ్తున్న సినిమా కష్టాలు ఏకరువు పెడుతున్నాడు.

పులిని చూసి నక్క వాత అనే నానుడి విన్నారు కదా అలా,

నాకు తెలిసిన వాళ్ళలో చాలా మంచి కవులు/కవయిత్రులు ఉన్నారు. వాళ్ళు వ్రాయటం, చెప్పటం మొదలుపెట్టారంటే కవిత్వం వరదలై ప్రవహిస్తుంది. ఇంకొక సమస్య ఏమిటంటే, వాళ్ళు చెప్పేదాంట్లో సగం అర్ధం చేసుకోవటానికే కష్టపడే వాడిని. పోనీ అర్ధం అడుగుదామా అంటే, చిరాకు పడతారు అంతా విశదీకరించి చెప్పాలా అని. ఈ విడమర్చి చెప్పటంలో నిగూడమైన స్పందన పోతుంది అని (వాళ్ళు చెప్పేది సబబే అనుకోండి, మనలో మాట - ఏదో ఒక ఒరవడిలో చెప్పేసారు కానీ వాళ్ళకే అమూర్తంగా అనిపిస్తుంది ).

కొన్ని రోజులకు తిక్క లేసింది, చల్, మనమే ఒక కవిత వ్రాసేస్తే పోలా అని (ఎవడుబడితే వాడు సినిమాలు తీసేస్తునట్టు, ముఖ్యంగా NRI లు) ఇంక చూసుకోండి,లాప్ టాపుచ్చుకుని బరిలోకి దిగా. దిగటమైతే దిగానుగానీ, పదాలు దొర్లవే, ప్రాస కుదిరితే అర్ధం రాదు, అర్ధం వస్తే వాచకంలా ఉంటుంది, ఒకటేమిటి అన్ని రకాల కలగాపులగం వెరసి ఫలితం సున్నా. అలా పడుతూ లేస్తూ కొంచం కొంచంగా వ్రాయటం మొదలుపెట్టా. ఈ ప్రస్తానం ఇలా నడుస్తానే ఉంటుంది. నేను ఆనందిస్తున్నా, అంతే కదండి కావల్సింది.

చివరాకరికి ఓ రెండు వ్రాసి పడేసా. అస్సలు ఎవరైనా చదువుతారా అన్న అనుమానం , చదివిన ఒకరిద్దరు బావుందనేసరికి చూసుకోండి నా సామి రంగా , ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం వచ్చేసింది (మన్నించాలి అప్పుడప్పుడూ సహజత్వపు భాష బయటపడిపోతుంది, ఎంత సభ్యతగా వ్రాద్దామన్నా)

ఇంకొక నవ్వు వచ్చే విషయం ఏంటో తెలుసా, నేను ఈ చిన్నకారు, సన్నకారు కవులను చూసి ఎలా వాతలు పెట్టుకుంటున్నానో, వాళ్ళు కూడా కొంచం పేరున్న కవుల వాతల లో నిమగ్నమై ఉంటారు (మరీ అలా కాదు , ఏడిపించటానికి అన్నానంతే)

కరుగుతున్న కల

పడిన తెల్లని మంచు గడచిన కాలంతో కరిగీ కరగని స్థితిలో
చిద్రమైన మనసులా చెల్లాచెదరై దాగిఉంచిన నిజస్వరూపంలో
చవిచూడని వేరీ కోణాన్ని ప్రస్పుటించే జ్వాలలో
అల్లకల్లోలమైన తెల్లని రంగు కొత్త పోకడలతో తెచ్చిపెట్టుకున్న వర్ణాలతో
ఘనీభవించిన మంచు , మారిన రంగు ఇష్టపడ్డ మనసునే విరిచేసి
సంతోషం వెన్నంటే దుఃఖం అనే జీవిత సత్యాన్ని తెలపకనే తెలిపాయి

Tuesday, December 16, 2008

పనిలేని మంగలి పిల్ల తల గొరిగినట్టు, ఏదైనా వ్రాద్దామని సంకల్పించా
కలం ముందుకు కదలందే, ఈ కవులు భావుకలందిరికీ కవితాప్రవాహం ఎలా పొర్లిపొంగుతుందో అనే ఆలోచనని నొక్కిపట్టి, కవితా వస్తువుకోసం వెతికా, అక్కడే మొదటి తప్పు చేస్తున్నానంటారా, ఇదేమైనా బజార్లో దొరికే వస్తువా అని.

మంచు విపరీతంగా కురుస్తోంది, కనుచూపుమేరా శ్వేతపత్రంలా విస్తరించి

చంద్రుని కిరణాలలో ధగధగ మెరుస్తున్న మంచు కణాల మెరుపులు

చల్లటి పిల్లగాలి విసిరేస్తున్న మంచు ధూళి కప్పబడిన మోడు చెట్లు

ప్రకృతి అద్బుతాలు కోకొల్లలు