Wednesday, April 15, 2009

మారథాన్ పరిగెట్టేసా

అన్నమాట ప్రకారం వివరాలు ఇవ్వటానికి వచ్చేసాను.  మారథాన్ పూర్తి అవటం,  నేను సఫలీకృతుడనవటం పూర్తయింది.  చివరాఖరికి ఎట్లాగైతే 26.2 మైళ్ళు 5గంటల 25నిమిషాలలో పరిగెట్టేసి నా లక్ష్యం సాధించేసా.  మా ప్రొఫెసరు గారి సహకారానికి ఓ అర్థం కల్పించాను.  భారతీయులు మారథాన్లు చేయగలరని నిరూపించాను.  

కృషిచేయాలని వున్నా ఇతరత్ర కారణాల వలన సాధనే అంతంత మాత్రం అంటే, మారథాన్ ఇంకో 5 రోజులు ఉందనగా జ్వరం వచ్చి మంచాన బడ్డాను. డాక్టర్ ఇచ్చిన సలహా ఏమిటంటే "జీవితంలో ఇంక ఎప్పుడైనా పరిగెట్టెచ్చు, ఇంకా తగ్గని జ్వరంతో 26 మైళ్ళ పరుగంటే కొంచం రిస్క్, ఇక నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో" అని. నా కేమీ తోచలేదు. 

శనివారం మారథాన్ అనగా, గురువారం ఉదయానికి జ్వరం తగ్గుముఖం పట్టింది. పొట్టపగల తినటం మొదలుపెట్టా. ఏదో విధంగా జ్వరంతో వచ్చిన నీరసాన్ని పోగొట్టాలని.

శనివారం మారథాన్ రోజు:

జీవితమంతా కుంభాలు కుంభాలు తింటూనే ఉన్నాను కదా, శక్తి ఉంటుందనే ఆశతో పరిగెట్టటానికి నిర్ణయించుకున్నా.  మా జమైకన్ ప్రొఫెసర్ గారు ప్రక్కనే ఉండి, ఒక వేళ మధ్యలో బాగా లేకపోతే ఆగి పోదువుగానీ అని సలహా ఇచ్చారు

8 గంటలకు పరుగు మొదలు, సుమారు 10 వేలమంది పాల్గొన్నారు పేస్ టీంలని ఉంటాయి, మన పరుగు సత్తా బట్టి వాళ్ళతో పరిగెడితే, ఒకటే స్థిరమైన వేగంలో పరిగెడతారు కనుక మనకొక నిర్దేశం వుంటుంది. మేము 4:30 పేస్ టీం తో బయలుదేరాము, అంటే మారథాన్ 4:30 గంటలలో పూర్తి చేసేటట్లు.

మొదటి 16 మైళ్ళు ఏ విధమైన సమస్య లేకుండా పరిగెత్తా,  మైలు 10నిమిషాల చొప్పున పూర్తిచేసేసాను. ఇక అప్పుడు ఆరంభమయ్యాయి,  క్రాంప్స్, పిక్కలు పట్టివేయటం అకస్మాత్తుగా ముందు కొంచం కొంచంగా మొదలై 18 వ మైలు దగ్గర ఎక్కువయ్యి చివరికి కాలు తీసి కాలు వేయలేనంత నెప్పి. ఒక రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళా పరిగెడదామంటే నెప్పి మొదలు. మా ప్రొఫెసర్ గారు "ఇంక నడుద్దాము.  ఎలాగోలా మారథాన్ పూర్తి చేద్దాం , నీకు మొదటిది కదా" అని అన్నారు.

నాలుగు మైళ్ళు నడిచిన తరువాత నెప్పి తగ్గినట్లనిపిస్తే నిదానంగా పరిగెట్టి చివరి మైళ్ళు పూర్తి చేసా.  అలా మొత్తానికి పూర్తి చెయ్యగలిగా.

విపరీతమైన చలికాలంలో సాధన చేసి, మధ్యలో రెండు మూడు వారాలు మడం నెప్పి తెచ్చుకుని (పాత షూ తో పరిగెట్టినందుకు), నివారణలు కనుక్కుని నెప్పి తగ్గించుకుని, మళ్ళీ పరుగులు సాధన చేసి, ఈ నా యజ్ఞాన్ని పూర్తి చేసా.  నిజానికి అలా ఎవో చిన్న చిన్న శారీరక ఇబ్బందులు,  వాటిని తట్టుకోవటం అంతా మానసికంగా మనలోని నిగ్రహాన్ని, సహనాన్ని వెలికి తెస్తాయి అని అనిపించింది. 

మైలు 20న, ఎవరైతే మా ప్రొఫెసర్ గారితో భారతీయులు మారథాన్ పరిగెట్టలేరు అన్నారో, ఆయనే దారి ప్రక్కన చేయి ఊపుతుంటే, నన్ను చూపించారు ఆయనకి.

మారథాన్ ఈజ్ ఎ మైండ్ గేం! 

http://www.illinoismarathon.com/

8 comments:

Srinivas said...

Congrats for finsihing the marathon on first attempt!

అనామిక said...

అద్భుతం. అభినందనలు. "సాధన చేత సమకూరు పనులు ధరలోన" నిజం చేసారు. కృషివుంటే ఏదైనా సాధ్యమే. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

నేస్తం said...

హమ్మయ మొత్తానికి సాధించి మాకు ఆదర్శం గా నిలిచారు కంగ్రాట్స్

బ్లాగాగ్ని said...

చాలా బాగుంది. పరుగు విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు. ఆగకుండా కనీసం ఒక్క అరగంట జాగింగ్ చెయ్యాలని ఎప్పట్నించో కోరిక. మీ స్ఫూర్తితో త్వరలో మొదలెట్టేస్తా.

Change Maker said...

శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి.
అనామిక గారు, బాగా చెప్పారు, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే, ధన్యవాదాలు
నేస్తం గారు, ధన్యావాదములండి.

Change Maker said...

బ్లాగాగ్ని గారు, ధన్యవాదాలు. తప్పకుండా పరిగెత్తెండి. రెండు సంవత్సారాల క్రితం నేను కూడా ఒక మైలు పరిగెట్టడానికి ఒగిర్చే వాడిని, మధ్యలోనే ఆగిపోయే వాడిని, శరీరాన్ని కష్టపెట్టటం ఇష్టం లేక . ఆ స్థితి నుంచి మారథాన్ పరిగెట్టే స్థితికి రావటానికి కారణం కొంచం కొంచం గా పరుగు దూరం పెంచుకుంటూ పోవటమే. అందుకని ఈ రోజే ఒక పది నిమిషాలు పరిగెట్టండి, అలా పెంచుకుంటూ పొండి. మనిషి సాధించలేనిది ఏమిటి చెప్పండి

asha said...

ఈ మద్యనే ఒకసారి పరిగెత్తాను.
బాగా ఆయాసం వచ్చేసింది. నాకేదో అయిపోయిందోనని భయపడిపోయాను. అయితే ఈ సారి
కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళతాను.

అయ్యో! మీకూ అభినందనలు చెప్పటం మరిచాను. :)
అభినందనలు.

Change Maker said...

భవాని గారు, ధన్యవాదాలు. మొదట్లో పరిగెత్తుతున్నప్పుడు అందరికీ అలాగే ఉంటుంది. మరీ వేగంగా పరిగెత్తారేమో .క్రొత్త పరుగరులు వేగంగా పరిగెత్తటానికి ప్రయత్నిస్తారు. నేనూ క్రొత్తలో అలాగే చేసేవాడిని. నిదానంగా ప్రారంభించండి. ఈ పరుగు పట్టిక http://www.ingnycmarathon.org/training/training_schedule.htm చూస్తే మారథాన్ కు శిక్షణ పొందే వాళ్ళు ఏ విధంగా చేస్తారో అర్ధం అవుతుంది