Wednesday, December 17, 2008

పులిని చూసి నక్క వాత - నానుడి1

ఏ మాటకామాటే, కవితాదృక్పదంతో వ్రాయటం చాలా కష్టమండి బాబూ, వెంటనే మీరు అడగవచ్చు అంత కష్టపడి వ్రాయాల్సిన అవసరమేంటి అని. మామూలుగా బ్లాగుల్లో అన్ని చోట్ల మంచి మంచి కవితలు చదువుతుంటాము కదా వీడేంటి అందంగా వ్రాయకుండా, వాడు పడ్తున్న సినిమా కష్టాలు ఏకరువు పెడుతున్నాడు.

పులిని చూసి నక్క వాత అనే నానుడి విన్నారు కదా అలా,

నాకు తెలిసిన వాళ్ళలో చాలా మంచి కవులు/కవయిత్రులు ఉన్నారు. వాళ్ళు వ్రాయటం, చెప్పటం మొదలుపెట్టారంటే కవిత్వం వరదలై ప్రవహిస్తుంది. ఇంకొక సమస్య ఏమిటంటే, వాళ్ళు చెప్పేదాంట్లో సగం అర్ధం చేసుకోవటానికే కష్టపడే వాడిని. పోనీ అర్ధం అడుగుదామా అంటే, చిరాకు పడతారు అంతా విశదీకరించి చెప్పాలా అని. ఈ విడమర్చి చెప్పటంలో నిగూడమైన స్పందన పోతుంది అని (వాళ్ళు చెప్పేది సబబే అనుకోండి, మనలో మాట - ఏదో ఒక ఒరవడిలో చెప్పేసారు కానీ వాళ్ళకే అమూర్తంగా అనిపిస్తుంది ).

కొన్ని రోజులకు తిక్క లేసింది, చల్, మనమే ఒక కవిత వ్రాసేస్తే పోలా అని (ఎవడుబడితే వాడు సినిమాలు తీసేస్తునట్టు, ముఖ్యంగా NRI లు) ఇంక చూసుకోండి,లాప్ టాపుచ్చుకుని బరిలోకి దిగా. దిగటమైతే దిగానుగానీ, పదాలు దొర్లవే, ప్రాస కుదిరితే అర్ధం రాదు, అర్ధం వస్తే వాచకంలా ఉంటుంది, ఒకటేమిటి అన్ని రకాల కలగాపులగం వెరసి ఫలితం సున్నా. అలా పడుతూ లేస్తూ కొంచం కొంచంగా వ్రాయటం మొదలుపెట్టా. ఈ ప్రస్తానం ఇలా నడుస్తానే ఉంటుంది. నేను ఆనందిస్తున్నా, అంతే కదండి కావల్సింది.

చివరాకరికి ఓ రెండు వ్రాసి పడేసా. అస్సలు ఎవరైనా చదువుతారా అన్న అనుమానం , చదివిన ఒకరిద్దరు బావుందనేసరికి చూసుకోండి నా సామి రంగా , ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం వచ్చేసింది (మన్నించాలి అప్పుడప్పుడూ సహజత్వపు భాష బయటపడిపోతుంది, ఎంత సభ్యతగా వ్రాద్దామన్నా)

ఇంకొక నవ్వు వచ్చే విషయం ఏంటో తెలుసా, నేను ఈ చిన్నకారు, సన్నకారు కవులను చూసి ఎలా వాతలు పెట్టుకుంటున్నానో, వాళ్ళు కూడా కొంచం పేరున్న కవుల వాతల లో నిమగ్నమై ఉంటారు (మరీ అలా కాదు , ఏడిపించటానికి అన్నానంతే)

3 comments:

మరువం ఉష said...

అరే మీరు భలేవారేను. రోజుకొక రంగు మారుస్తున్నారు అదే లేండి మీ పెన్నులోని సిరా - "రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు..." అన్న శ్రి శ్రి గారు "మనసున మనసై, బ్రతుకున బ్రతుకై..." అని కూడ అన్నట్లు మీరు కూడా ఈ "వాతల" పులివాత భలేగాపడ్డారే? రేపేరంగు పొడచూపుతుందో మళ్ళీ వచ్చిచూడాల్సిందే సుమా!

నేస్తం said...

:)

Change Maker said...

ఉషగారు,పోయేదేముంది, విభిన్న ప్రక్రియాప్రయోగం చేద్దామనే తహతహ. కొత్త రంగు కోసం ప్రయత్నిస్తున్నాను, ఎంత సఫలీకృతమవుతానో కానీ.