Friday, April 17, 2009

26.2 మైళ్ళ పరుగు ప్రయత్నంలో నేర్చుకున్నవి

ఈ మారథాన్ పరుగు ప్రయత్నంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవి. నిజానికి తరతరాలనుంచి పెద్దవాళ్ళు చెప్పినవే. కొన్ని నా ప్రయాణంలో గోచరించినవి, మరి కొన్ని మునుపు విన్నవీ తిరిగి గుర్తుకొచ్చినవీను. ఇలా మీ అందరితో మరోసారి పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను.

  1. ఏ పనైనా మొదలుపెట్టకముందు అసాధ్యంగానే ఉంటుంది. అలాగే నాకు 26మైళ్ళు అనగానే గుండెల్లో రాయి పడింది. ఏకధాటిన నాలుగు గంటల పరుగు అనేసరికి నా సామర్ధ్యం మీద నాకే అపనమ్మకం, అసలు సాధనలోకి వెళ్ళాలా వద్దా అని సంకోచం కలిగాయి. సంకల్పసిద్దే నా బలం అనుకుని మొదలిడాను. అంతిమ లక్ష్యం గురించి ఆలోచించకుండా, నెలల తరబడి కొంచం కొంచంగా పరుగు దూరం పెంచుకుంటూ పోయి ఆఖరుకు పరిగెత్తేసా. దేనికైనా ప్రారంభం కావాలి. అది అనుకున్న రోజే కావాలి. కాలక్రమేణా మన లక్ష్యానికి చేరువ అవుతాం.
  2. ఆసరా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. నాకు ఒక మంచి మనిషి ప్రోత్సాహం దొరికేసరికి, లక్ష్యం ఎంత కష్టం అని ఆలోచించకుండానే ముందుకి దూకాను. మనలను ప్రొత్సాహించే మంచి వాళ్ళు దొరకటం మన అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మన జీవన ప్రయాణంలో వెతుకుతూ ఉండాలి. మనకి అందిన ప్రోత్సాహం మనం కూడా ఇతరులకు ఇవ్వాలని నేర్చుకున్నాను.
  3. లక్ష్యం నిర్దేశితమైన తరువాత, ఎండ, వాన, చలి అనేది లేకుండా ప్రయత్నిస్తాం (నాది పరుగు కాబట్టి వాతావరణం పాత్ర ఉంది). చలి అంటే ఇంట్లో మునగ తీసుకుని, వెచ్చగా రగ్గు కప్పుకుని బిర్యాని (కొంత మందికి మిరపకాయ బజ్జీలు) తినే బాపతు అయిన నేనే, ఎముకలు కొరికే చలిలో పరిగెడతానని కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు అలా పరిగెత్తే వాళ్ళను చూసి, అసలు ఎలా పరుగెడతారో అనుకునే వాడిని. కానీ నా లక్ష్యమే నన్ను చివరి వరకు నడిపించింది.
  4. లక్ష్య సాధన వయసుకి సంబందించిన కాదు, మనసుకి ముడిపడినది. దానికి స్త్రీ పురుషుల తేడా తెలియదు. నేను ఈతకొలను లో ఈత నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నా ప్రక్కనే ఒక 90 ఏళ్ళ స్త్రీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవటానికి వచ్చింది. ఆమెతో పరిచయమైతే చెప్పింది, 80 ఏళ్ల స్నేహితురాలు నేర్చుకుందంట ఈ మధ్య , అందుకని ఈమె మొదలుపెట్టింది. ఆ రోజే అనుకున్నా, జీవితాంతం వరకు క్రొత్తవి నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ గడపాలని.
  5. లక్ష్య సాధనలో, హేమాహేమీలు ఎదురౌతారు, మనం చెయ్యాలనుకున్నది అవలీలగా చేస్తుంటారు. మన గోల మనది. సాధన చేస్తున్నప్పుడు, నా స్నేహితుడు చెప్పిన విషయం, "మారథాన్ పరుగెడుతున్నప్పుడు, 70 ఏళ్ళ వ్యక్తి కూడా కుర్రవాడి మాదిరిగా సునాయాసంగా నిన్ను దాటి వెళ్ళిపోతుంటాడు. అది చూసి ఏమీ కలత చెందవద్దు. నీ ప్రయత్నం నీది. వాళ్లెంత సాధనతో ఈ స్థానానికి చేరుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదు. నువ్వేదో పోటుగాడిలా ఈ మధ్య మొదలుపెట్టి, రెచ్చిపోయి చతికిలపడకు." అని. అటువంటివారు నిజంగానే తారసపడ్డారు. వారు నాలో ఆ స్థాయికి చేరాలన్న స్ఫూర్తిని పెంచారే కానీ వారిని అధిగమించగలనా అని నిస్పృహని మాత్రం కలిగించలేదు.
  6. మనిషి తలచుకుంటే ఏమన్నా చేయగలడు. నా మటుకు నేను పూర్తిగా తలచుకోలేదు. అయినా చేసిన సాధన సరిపోయి, దేవుని దయ వల్ల పూర్తి చేసేసాను. కాబట్టి మనము పూర్తి ప్రయత్నం చెయ్యకుండా, దేవుని పై భారం వదిలెయ్యాలి. (అయ్యో ఇది ఆచరించారంటే గొడవలైపోతాయి)

ఇవన్నీ నేనేమీ కొత్తగా కనిపెట్టిన విషయాలేమి కాదు, నేను నేర్చుకున్న విషయాలు. ఇంకొన్ని విశేషాలతో తరువాయి టపాలో కలుద్దాం.

5 comments:

అనామిక said...

మీరు పంచుకున్నవి మా అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే అంటారు "పెద్దల మాట, చద్ది మూట" అని. అవెప్పటికీ వమ్ముకావు. మనకి తప్పక తిరిగి గుర్తుకొస్తాయి. అయినా కూడా ఎప్పుడో ముగిసిన భగీరథుడు వంటి వార్ని చరిత్ర గూర్చి తలుచుకునే ముందు ఇకపై మీవంటి సమకాలీనులని గురించి చెప్పుకుంటాము. మరోసారి అభినందనలు. మీ నుండి మరో టపా కొరకు ప్రతీక్షిస్తూ ..

ఉమాశంకర్ said...

మంచి ఉత్తేజపూరితమైన మాటలు అందించారు. ధన్యవాదాలు.

asha said...

అనుభవంలోనూ, ఆలోచనలలోనూ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయినట్టున్నారే. స్పూర్తిదాయకమైన టపాని అందించారు. ధన్యవాదములు.

మిత్రవింద said...

బాగుందండి. అసలింతకీ మంచి మనిషి ప్రోత్సాహం మాలంగానే ఈ పరుగు లక్ష్యం పెట్టుకుని సాధించారా? జీవితంలో ఏదో సాదిద్దామనే మీ తపన మీచేత ఈ పని చేయించిందా? ఈ లక్ష్య సాధన విజయవంతంగా ముగిసాక "ఆలోచనలకు ఆచరణకు ఉన్న అంతరం, ఏదో రోజు కలలు నెరవేరతాయనే ఆశ" అన్న మీ స్వగతంలో ఎంత మార్పు వచ్చింది? ఈ విషయాలు కూడా పంచుకుంటే ఈ టపాకి సంపూర్ణత చేకూరేదేమో?

Change Maker said...

అనామిక గారు, ఉమాశంకర్ గారు, కొత్తపాళీ గారు, భవాని గారు ధన్యవాదాలు.
మిత్రవింద గారు, తప్పకుండా మీరు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను