Friday, April 17, 2009

26.2 మైళ్ళ పరుగు ప్రయత్నంలో నేర్చుకున్నవి

ఈ మారథాన్ పరుగు ప్రయత్నంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవి. నిజానికి తరతరాలనుంచి పెద్దవాళ్ళు చెప్పినవే. కొన్ని నా ప్రయాణంలో గోచరించినవి, మరి కొన్ని మునుపు విన్నవీ తిరిగి గుర్తుకొచ్చినవీను. ఇలా మీ అందరితో మరోసారి పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను.

  1. ఏ పనైనా మొదలుపెట్టకముందు అసాధ్యంగానే ఉంటుంది. అలాగే నాకు 26మైళ్ళు అనగానే గుండెల్లో రాయి పడింది. ఏకధాటిన నాలుగు గంటల పరుగు అనేసరికి నా సామర్ధ్యం మీద నాకే అపనమ్మకం, అసలు సాధనలోకి వెళ్ళాలా వద్దా అని సంకోచం కలిగాయి. సంకల్పసిద్దే నా బలం అనుకుని మొదలిడాను. అంతిమ లక్ష్యం గురించి ఆలోచించకుండా, నెలల తరబడి కొంచం కొంచంగా పరుగు దూరం పెంచుకుంటూ పోయి ఆఖరుకు పరిగెత్తేసా. దేనికైనా ప్రారంభం కావాలి. అది అనుకున్న రోజే కావాలి. కాలక్రమేణా మన లక్ష్యానికి చేరువ అవుతాం.
  2. ఆసరా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. నాకు ఒక మంచి మనిషి ప్రోత్సాహం దొరికేసరికి, లక్ష్యం ఎంత కష్టం అని ఆలోచించకుండానే ముందుకి దూకాను. మనలను ప్రొత్సాహించే మంచి వాళ్ళు దొరకటం మన అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మన జీవన ప్రయాణంలో వెతుకుతూ ఉండాలి. మనకి అందిన ప్రోత్సాహం మనం కూడా ఇతరులకు ఇవ్వాలని నేర్చుకున్నాను.
  3. లక్ష్యం నిర్దేశితమైన తరువాత, ఎండ, వాన, చలి అనేది లేకుండా ప్రయత్నిస్తాం (నాది పరుగు కాబట్టి వాతావరణం పాత్ర ఉంది). చలి అంటే ఇంట్లో మునగ తీసుకుని, వెచ్చగా రగ్గు కప్పుకుని బిర్యాని (కొంత మందికి మిరపకాయ బజ్జీలు) తినే బాపతు అయిన నేనే, ఎముకలు కొరికే చలిలో పరిగెడతానని కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు అలా పరిగెత్తే వాళ్ళను చూసి, అసలు ఎలా పరుగెడతారో అనుకునే వాడిని. కానీ నా లక్ష్యమే నన్ను చివరి వరకు నడిపించింది.
  4. లక్ష్య సాధన వయసుకి సంబందించిన కాదు, మనసుకి ముడిపడినది. దానికి స్త్రీ పురుషుల తేడా తెలియదు. నేను ఈతకొలను లో ఈత నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నా ప్రక్కనే ఒక 90 ఏళ్ళ స్త్రీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవటానికి వచ్చింది. ఆమెతో పరిచయమైతే చెప్పింది, 80 ఏళ్ల స్నేహితురాలు నేర్చుకుందంట ఈ మధ్య , అందుకని ఈమె మొదలుపెట్టింది. ఆ రోజే అనుకున్నా, జీవితాంతం వరకు క్రొత్తవి నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ గడపాలని.
  5. లక్ష్య సాధనలో, హేమాహేమీలు ఎదురౌతారు, మనం చెయ్యాలనుకున్నది అవలీలగా చేస్తుంటారు. మన గోల మనది. సాధన చేస్తున్నప్పుడు, నా స్నేహితుడు చెప్పిన విషయం, "మారథాన్ పరుగెడుతున్నప్పుడు, 70 ఏళ్ళ వ్యక్తి కూడా కుర్రవాడి మాదిరిగా సునాయాసంగా నిన్ను దాటి వెళ్ళిపోతుంటాడు. అది చూసి ఏమీ కలత చెందవద్దు. నీ ప్రయత్నం నీది. వాళ్లెంత సాధనతో ఈ స్థానానికి చేరుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదు. నువ్వేదో పోటుగాడిలా ఈ మధ్య మొదలుపెట్టి, రెచ్చిపోయి చతికిలపడకు." అని. అటువంటివారు నిజంగానే తారసపడ్డారు. వారు నాలో ఆ స్థాయికి చేరాలన్న స్ఫూర్తిని పెంచారే కానీ వారిని అధిగమించగలనా అని నిస్పృహని మాత్రం కలిగించలేదు.
  6. మనిషి తలచుకుంటే ఏమన్నా చేయగలడు. నా మటుకు నేను పూర్తిగా తలచుకోలేదు. అయినా చేసిన సాధన సరిపోయి, దేవుని దయ వల్ల పూర్తి చేసేసాను. కాబట్టి మనము పూర్తి ప్రయత్నం చెయ్యకుండా, దేవుని పై భారం వదిలెయ్యాలి. (అయ్యో ఇది ఆచరించారంటే గొడవలైపోతాయి)

ఇవన్నీ నేనేమీ కొత్తగా కనిపెట్టిన విషయాలేమి కాదు, నేను నేర్చుకున్న విషయాలు. ఇంకొన్ని విశేషాలతో తరువాయి టపాలో కలుద్దాం.

Wednesday, April 15, 2009

మారథాన్ పరిగెట్టేసా

అన్నమాట ప్రకారం వివరాలు ఇవ్వటానికి వచ్చేసాను.  మారథాన్ పూర్తి అవటం,  నేను సఫలీకృతుడనవటం పూర్తయింది.  చివరాఖరికి ఎట్లాగైతే 26.2 మైళ్ళు 5గంటల 25నిమిషాలలో పరిగెట్టేసి నా లక్ష్యం సాధించేసా.  మా ప్రొఫెసరు గారి సహకారానికి ఓ అర్థం కల్పించాను.  భారతీయులు మారథాన్లు చేయగలరని నిరూపించాను.  

కృషిచేయాలని వున్నా ఇతరత్ర కారణాల వలన సాధనే అంతంత మాత్రం అంటే, మారథాన్ ఇంకో 5 రోజులు ఉందనగా జ్వరం వచ్చి మంచాన బడ్డాను. డాక్టర్ ఇచ్చిన సలహా ఏమిటంటే "జీవితంలో ఇంక ఎప్పుడైనా పరిగెట్టెచ్చు, ఇంకా తగ్గని జ్వరంతో 26 మైళ్ళ పరుగంటే కొంచం రిస్క్, ఇక నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో" అని. నా కేమీ తోచలేదు. 

శనివారం మారథాన్ అనగా, గురువారం ఉదయానికి జ్వరం తగ్గుముఖం పట్టింది. పొట్టపగల తినటం మొదలుపెట్టా. ఏదో విధంగా జ్వరంతో వచ్చిన నీరసాన్ని పోగొట్టాలని.

శనివారం మారథాన్ రోజు:

జీవితమంతా కుంభాలు కుంభాలు తింటూనే ఉన్నాను కదా, శక్తి ఉంటుందనే ఆశతో పరిగెట్టటానికి నిర్ణయించుకున్నా.  మా జమైకన్ ప్రొఫెసర్ గారు ప్రక్కనే ఉండి, ఒక వేళ మధ్యలో బాగా లేకపోతే ఆగి పోదువుగానీ అని సలహా ఇచ్చారు

8 గంటలకు పరుగు మొదలు, సుమారు 10 వేలమంది పాల్గొన్నారు పేస్ టీంలని ఉంటాయి, మన పరుగు సత్తా బట్టి వాళ్ళతో పరిగెడితే, ఒకటే స్థిరమైన వేగంలో పరిగెడతారు కనుక మనకొక నిర్దేశం వుంటుంది. మేము 4:30 పేస్ టీం తో బయలుదేరాము, అంటే మారథాన్ 4:30 గంటలలో పూర్తి చేసేటట్లు.

మొదటి 16 మైళ్ళు ఏ విధమైన సమస్య లేకుండా పరిగెత్తా,  మైలు 10నిమిషాల చొప్పున పూర్తిచేసేసాను. ఇక అప్పుడు ఆరంభమయ్యాయి,  క్రాంప్స్, పిక్కలు పట్టివేయటం అకస్మాత్తుగా ముందు కొంచం కొంచంగా మొదలై 18 వ మైలు దగ్గర ఎక్కువయ్యి చివరికి కాలు తీసి కాలు వేయలేనంత నెప్పి. ఒక రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళా పరిగెడదామంటే నెప్పి మొదలు. మా ప్రొఫెసర్ గారు "ఇంక నడుద్దాము.  ఎలాగోలా మారథాన్ పూర్తి చేద్దాం , నీకు మొదటిది కదా" అని అన్నారు.

నాలుగు మైళ్ళు నడిచిన తరువాత నెప్పి తగ్గినట్లనిపిస్తే నిదానంగా పరిగెట్టి చివరి మైళ్ళు పూర్తి చేసా.  అలా మొత్తానికి పూర్తి చెయ్యగలిగా.

విపరీతమైన చలికాలంలో సాధన చేసి, మధ్యలో రెండు మూడు వారాలు మడం నెప్పి తెచ్చుకుని (పాత షూ తో పరిగెట్టినందుకు), నివారణలు కనుక్కుని నెప్పి తగ్గించుకుని, మళ్ళీ పరుగులు సాధన చేసి, ఈ నా యజ్ఞాన్ని పూర్తి చేసా.  నిజానికి అలా ఎవో చిన్న చిన్న శారీరక ఇబ్బందులు,  వాటిని తట్టుకోవటం అంతా మానసికంగా మనలోని నిగ్రహాన్ని, సహనాన్ని వెలికి తెస్తాయి అని అనిపించింది. 

మైలు 20న, ఎవరైతే మా ప్రొఫెసర్ గారితో భారతీయులు మారథాన్ పరిగెట్టలేరు అన్నారో, ఆయనే దారి ప్రక్కన చేయి ఊపుతుంటే, నన్ను చూపించారు ఆయనకి.

మారథాన్ ఈజ్ ఎ మైండ్ గేం! 

http://www.illinoismarathon.com/